పెద్దాపురం, కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK):
గోదావరి పుష్కరాల నాటికి కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం ఆనూరులో నిర్మాణంలో ఉన్న వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర మున్సిపల్, అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వ్యర్థాలను విద్యుత్‌గా మార్చే విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నామని చెప్పారు.
శుక్రవారం ఆనూరు గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న అర్బన్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్‌ను మంత్రి పొంగూరు నారాయణ, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత సంస్థ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సేకరించే సుమారు 10 వేల టన్నుల వ్యర్థాలను పునర్వినియోగించి విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా తొమ్మిది భారీ వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా 2014–19 కాలంలో టోక్యో, సింగపూర్, మలేషియా, రష్యా దేశాల్లో వ్యర్థాల నిర్వహణ విధానాలను అధ్యయనం చేసి వేస్ట్-టు-ఎనర్జీ సాంకేతికతకు శ్రీకారం చుట్టామని చెప్పారు.
మున్సిపాలిటీల నుంచి రోజువారీగా వచ్చే సుమారు 7 వేల టన్నుల వ్యర్థాలతో పాటు పంచాయతీల నుంచి సేకరించే వ్యర్థాలను కూడా విద్యుత్ ఉత్పత్తికి వినియోగించేలా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరులో ప్లాంట్లు అందుబాటులో ఉండగా, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, విజయనగరం, కాకినాడ జిల్లా పెద్దాపురం ప్రాంతాల్లో ఆరు కొత్త ప్లాంట్లతో పాటు భీమవరం–నరసాపురం ప్రాంతంలో మరో ప్లాంట్ నిర్మాణాన్ని చేపడుతున్నామని వివరించారు.
భూగర్భ జలాలు కలుషితం కాకుండా గతంలో పేరుకుపోయిన 153 లక్షల టన్నుల లెగసీ వ్యర్థాలను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రధాన ప్లాంట్లు పూర్తయ్యే వరకు కొత్తగా సేకరించే వ్యర్థాలు పేరుకుపోకుండా 107 తాత్కాలిక ప్రాసెసింగ్ ప్లాంట్ల ద్వారా వ్యర్థాలను వేరు చేసి రీసైక్లింగ్, సేంద్రీయ ఎరువుల తయారీ చేపడుతున్నామని చెప్పారు.
కాకినాడ జిల్లా ప్లాంట్‌ను రాబోయే గోదావరి పుష్కరాల నాటికి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలోని చెత్త సమస్యతో పాటు కాలువల నీటి కాలుష్యానికి శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి స్పష్టం చేశారు.
రోజుకు 1,200 టన్నుల వ్యర్థాల వినియోగం
కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో భాగంగా చెత్త రహిత, పరిశుభ్రమైన వాతావరణాన్ని నెలకొల్పడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో రోజుకు సేకరించే సుమారు 1,200 టన్నుల వ్యర్థాలను ఒకే చోటకు చేర్చి విద్యుత్ ఉత్పత్తి చేసే పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుగా పెద్దాపురం ప్లాంట్‌ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
గుంటూరు, విశాఖపట్నంలో జిందాల్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్లాంట్ల తరహాలో కాకినాడ జిల్లాలోనూ ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నామని, గోదావరి పుష్కరాల నాటికి ప్రారంభించేందుకు పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.
గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి కుటుంబం తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేలా ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. చెత్త పేరుకుపోకుండా వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్ శాశ్వత పరిష్కారం చూపుతుందని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ వేగవంతం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వానికి ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

