కాకినాడ సిటీ, ఆగస్టు 14:, Kakinada (VISWAM VOICE DESK):
ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేసి, పెండింగ్ అంశాలను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని జిల్లా ఇన్చార్జి మంత్రి పి. నారాయణ పేర్కొన్నారు.
శుక్రవారం కాకినాడ కలెక్టరేట్ లో జరిగిన జిల్లా సమీక్షా కమిటీ (డి.ఆర్.సి) సమావేశం అనంతరం జిల్లా ఇన్చార్జి మంత్రి పి. నారాయణ.. రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు, ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య; ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ అర్బన్, పెద్దాపురం, జగ్గంపేట ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
జిల్లా సమీక్ష సమావేశంలో జిల్లా అధికారులతో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలను మంత్రి పి నారాయణ ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు వివరించారు.
జిల్లా సమీక్షా సమావేశంలో ప్రజా సమస్యలపై అధికారులు, శాసనసభ్యులు వివిధ అంశాలపై సానుకూలంగా స్పందించారని జిల్లా ఇన్చార్జి మంత్రి పి. నారాయణ మీడియా సమావేశంలో వెల్లడించారు. గత సమావేశంలో చర్చించిన అంశాల పురోగతిని, పెండింగ్ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను ఈ సమావేశంలో కూలంకషంగా సమీక్షించినట్లు ఆయన తెలిపారు.
-వ్యవసాయ ఇన్సూరెన్స్, గృహ నిర్మాణ సమస్యలు:
రైతుల పంటల ఇన్సూరెన్స్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, దీనిని పొడిగించాలని గౌరవ ప్రజాప్రతినిధులు కోరడంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి గడువు పొడిగింపునకు తీవ్రంగా కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల పేరుతో కేవలం కాగితాలు ఇచ్చి సరైన స్థలాలు కేటాయించని అవకతవకలపై గత రెండు సంవత్సరాలుగా తీవ్ర కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు.ఆర్ డి ఓ స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీలు వేసి, క్షేత్రస్థాయి పరిశీలన జరిపి 15 రోజుల్లోగా తగిన పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు తెలిపారు.
– నూతన అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, రాజీవ్ గృహకల్ప సముదాయాలు మరమ్మతులు:
పేదలకు కేవలం ఐదు రూపాయలకే అన్నం పెట్టిన అన్నా క్యాంటీన్లను మొదటి వంద రోజుల్లోనే వాటిని పునరుద్ధరించినట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రజల డిమాండ్ మేరకు మరిన్ని కొత్త అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు చర్యలుతీసుకుంటామన్నారు. దెబ్బతిన్న రాజీవ్ గృహకల్ప భవనాల మరమ్మతులపై ముఖ్యమంత్రితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఓఎన్జీసీ ప్రమాద బాధితులకు, పిఠాపురంలో విద్యుత్ లైన్ల సవరణకు సత్వర సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
– పీఎం సూర్యఘర్ పథకం, వైద్య సేవలు అందుబాటులోకి:
సూర్యఘర్ పథకం అమలులో కాకినాడ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉందని, దీనిని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా వర్తింప జేసేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళాలని జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ కోరార న్నారు. కాకినాడ జీజీహెచ్ లో అత్యవసరంగా కార్డియాలజిస్ట్ నియామకం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. జీతాలు పెంచయినా సేవలు అందుబాటులోకి తెచ్చేలా జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.
-తాగునీటి వనరుల సంరక్షణ, ఎల్ నినో ప్రభావం:
ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం దృష్ట్యా తాగునీటి భద్రత అత్యంత కీలకమని, దీనిపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించి, ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులకు నిరంతరం తగు సూచనలు ఇస్తున్నారని మంత్రి తెలిపారు. డీఆర్సీ సమావేశంలో భాగంగా జిల్లాలోని దాదాపు 63 నీటి ట్యాంకులను గ్రావిటీ ద్వారా నీటితో నింపే అంశంపై చర్చించామని, దీనిపై పూర్తిస్థాయిలో పరిశోధన చేసి తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించినట్లు మంత్రి పి. నారాయణ మీడియాకు వివరించారు.

