విశ్వంవాయిస్ న్యూస్ డెస్క్, అమలాపురం:
అమలాపురం( విశ్వం వాయిస్)
పట్టణాలలో అర్బన్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణాలు వేగవంతం చేస్తూ ఎప్పటికప్పుడు పూర్తయిన పనులకు బిల్లులు అప్లోడ్ చేయడం ద్వారా నిర్మాణాలలో పురోగతి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, అర్బన్, రూరల్ హెల్త్ క్లినిక్ లు, డిజిటల్ లైబ్రరీలు, బిఎంసియు నిర్మాణాల పురోగతి పై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు, మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన అంశాలపై మండల స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించి వారం వారం పురోగతి సాధించాలని అవసరమైన శాశ్వత భవనాలకు భూ సేకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సేకరించిన భూములపై ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలని సూచించారు. పూర్తి చేసిన పనులపై బిల్లులు ఎప్పటికప్పుడు జనరేట్ చేస్తూ ఆశించిన పురోగతి తీసుకురావాలని అన్నారు.
జిల్లా జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర మాట్లాడుతూ ఓటీఎస్ ద్వారా రిజిస్ట్రేషన్లు స్కానింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి లబ్దిదారులకు డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించారు. వైఎస్సార్ శాశ్వత భూ రక్ష రీ సర్వే ద్వారా భావితరాలకు వివాదరహిత భూములను అందించే దిశగా అన్ని చర్యలు పగడ్బందీగా చేపట్టాలన్నారు. అవినీతి, లంచాలకు తావు లేకుండా పారదర్శకతతో ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. భూ రికార్డుల స్వచ్చికరణ ద్వారా రికార్డులను ఎవరూ మార్చలేని విధంగా టేoపర్ చేయలేని విధముగా రూపొందించాలని ఆదేశించారు. మూడు దశలలో సర్వే ప్రక్రియను పూర్తి చేసి అంతిమంగా సచివాలయంలో రిజిస్ట్రేషన్లు జరగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. సర్వే అనంతరం జగనన్న భూ హక్కు పత్రాలు భూ యజమానులకు అందజేయాలన్నారు. రెవెన్యూ విలేజ్ చొప్పున సర్వే చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. సర్వే ఫలితాలు పూర్తిగా అందేలా భూ రికార్డుల స్వచ్చికరణ జరగాలన్నారు. అదేవిధంగా వెబ్ ల్యాండ్ అప్డేట్, గ్రామ ల్యాండ్ రిజిస్టర్ అప్డేట్, గ్రామ ఖాతా రిజిస్టర్ లో అన్ని భూ వివరాలు సమగ్రంగా అప్డేట్ చేయాలన్నారు. ఇకపై డూప్లికేట్ రిజిస్ట్రేషన్లకు చెక్ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్వో సిహెచ్ సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.