ePaper
Friday, October 2, 2026
ePaper
HomeCRIME VOICEవిద్యార్థుల గొడవపై పోలీసుల కౌన్సెలింగ్.

విద్యార్థుల గొడవపై పోలీసుల కౌన్సెలింగ్.

📰 Generate e-Paper Clip

కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK):

సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోపై వన్ టౌన్ పోలీసుల స్పందన

తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక

కాకినాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాఠశాల విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి గొడవకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందుమాధవ్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ ఎం. నాగ దుర్గారావు సంబంధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పరదేశమ్మపేట మున్సిపల్ హైస్కూల్, ఘాటీ సెంటర్ హైస్కూల్‌కు చెందిన కొంతమంది విద్యార్థులు శివాలయం వీధిలోని డాక్టర్ బసవయ్య ఆయుర్వేద ఆసుపత్రి సమీపంలోని ట్యూషన్ కేంద్రానికి వెళ్తున్నారు. ట్యూషన్ ముగిసిన అనంతరం పార్కింగ్ చేసిన సైకిళ్లను తీసుకునే సమయంలో విద్యార్థుల మధ్య చిన్నపాటి వివాదం చోటుచేసుకుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు.

విషయం పోలీసుల దృష్టికి రావడంతో సంబంధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో సీఐ నాగ దుర్గారావు మాట్లాడారు. చిన్న విషయాలకు గొడవలకు దిగకుండా పరస్పరం స్నేహభావంతో మెలగాలని, చదువుపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు కూడా శ్రద్ధ వహించాలని తెలిపారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆధారాలు లేకుండా తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే పోస్టులు లేదా వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం, ఇతరులకు పంపించడం వల్ల చట్టపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.

అనుమానాస్పద సమాచారం లేదా వీడియోలు కనిపించినప్పుడు వాటిని నిర్ధారించుకోకుండా పంచుకోవద్దని, అవసరమైతే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని వన్ టౌన్ పోలీసులు కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img