ePaper
Saturday, August 15, 2026
ePaper
HomeBUSINESS VOICEపింఛన్ల పంపిణీలో ప్రజా సంతృప్తి 100 శాతానికి చేరాలి

పింఛన్ల పంపిణీలో ప్రజా సంతృప్తి 100 శాతానికి చేరాలి

📰 Generate e-Paper Clip

కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK):

లబ్ధిదారుల ఇంటి వద్దకే పారదర్శకంగా పింఛన్ అందించాలి

 

సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలి.. ఎలాంటి నగదు స్వీకరించరాదు

 

పింఛన్ నిధుల్లో అక్రమాలకు పాల్పడితే తొలగింపుతో పాటు క్రిమినల్ కేసులు

 

జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

కాకినాడ జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించి, వచ్చే నెల నాటికి ప్రజా సంతృప్తి స్థాయిని నూరు శాతానికి తీసుకెళ్లే లక్ష్యంతో అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు.

 

గురువారం కాకినాడ కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరంలో ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో పింఛన్ల పంపిణీపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగులు తదితర లబ్ధిదారులకు అండగా నిలిచే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను వారి ఇంటి వద్దకే తీసుకెళ్లి పారదర్శకంగా అందించాలని సూచించారు. పింఛన్ పంపిణీ సమయంలో సిబ్బంది లబ్ధిదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

 

పింఛన్ అందుకున్న ఆనందంలో లబ్ధిదారులు స్వచ్ఛందంగా నగదు ఇవ్వడానికి ప్రయత్నించినా పంపిణీ చేసే సచివాలయ సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించరాదని హెచ్చరించారు. ప్రభుత్వ సేవలపై ప్రజల్లో పూర్తి నమ్మకం, సంతృప్తి కలిగే విధంగా సిబ్బంది పనిచేయాలని పేర్కొన్నారు.

 

గత నెలతో పోలిస్తే ప్రస్తుత నెలలో ప్రజా సంతృప్తి స్థాయిలు తగ్గినట్లు గుర్తిస్తే సంబంధిత సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. లబ్ధిదారుల ఫోన్ నంబర్లు సక్రమంగా నమోదయ్యేలా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

 

ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పింఛన్ పంపిణీ విధానం, సిబ్బంది ప్రవర్తన, నిర్వహణ తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు.

 

పింఛన్ నిధుల దుర్వినియోగానికి పాల్పడే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులను కాజేసినట్లు నిర్ధారణ అయితే సంబంధిత సచివాలయ సిబ్బంది నుంచి మొత్తం సొమ్మును రికవరీ చేయడంతో పాటు వారిని విధుల నుంచి తొలగించి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించిన రికార్డులను కలెక్టరేట్‌కు సమర్పించాలని సూచించారు.

 

ఈ సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ జి. శ్రీనివాసరావు, జిల్లా అభివృద్ధి అధికారి పి. వాసుదేవరావు, జిల్లా స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు నోడల్ అధికారి జె. వేణుగోపాల్, పలువురు ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img