ePaper
Friday, August 14, 2026
ePaper
HomeHEALTH VOICEఅవయవ దానం.. మరొకరికి పునర్జన్మ.

అవయవ దానం.. మరొకరికి పునర్జన్మ.

📰 Generate e-Paper Clip

కాకినాడ సిటీ, Kakinada (VISWAM VOICE DESK):

మెడికవర్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ

ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి జంక్షన్ వరకు భారీ ప్రదర్శన

విద్యార్థుల ఆకట్టుకున్న ఫ్లాష్‌మాబ్

అవయవ దానంపై అపోహలు వీడాలి: జిల్లా ఎస్పీ బిందు మాధవ్

అవయవ దానం ద్వారా మరొకరి జీవితానికి పునర్జన్మ ప్రసాదించవచ్చని, ఈ మహోన్నత కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ అన్నారు.

ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ఆధ్వర్యంలో గురువారం నగరంలో అవగాహన ర్యాలీ, ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. ఎస్పీ కార్యాలయం నుంచి భానుగుడి జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. కె. అనిత జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అవయవ దానం ద్వారా మరొకరికి కొత్త జీవితాన్ని అందించే గొప్ప అవకాశం లభిస్తుందన్నారు. సమాజంలో అవయవ దానంపై మరింత చైతన్యం పెరగాలని, ముఖ్యంగా యువత ఈ సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కుడా చైర్మన్ సత్య తలాటం మాట్లాడుతూ, అవయవ దానం మహోన్నతమైన సేవ అని పేర్కొన్నారు. మనిషి మరణానంతరం కూడా మరొకరి ప్రాణాలను కాపాడే అవకాశం అవయవ దానం ద్వారా లభిస్తుందన్నారు. ప్రజలు అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించుకుని స్వచ్ఛందంగా ముందుకు రావాలని సూచించారు. యువతలో అవగాహన పెంచేందుకు మెడికవర్ హాస్పిటల్స్ చేపట్టిన ర్యాలీ, ఫ్లాష్‌మాబ్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అభినందించారు.

మెడికవర్ హాస్పిటల్స్ యూరాలజిస్ట్ డా. కల్యాణ్ బాబు, నెఫ్రాలజిస్ట్ డా. రాజా అమరేంద్ర, అనస్థీషియా విభాగం వైద్యుడు డా. కిషోర్ బాబు మాట్లాడుతూ అవయవ దానం ప్రాముఖ్యతను వివరించారు. అవయవ దానం ద్వారా అవసరంలో ఉన్నవారికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుందని, దీనిపై ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ నందికోళ్ల ఆంజనేయస్వామి (అంజిబాబు) మాట్లాడుతూ, అవయవ దానంపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించేందుకు నిరంతర అవగాహన కార్యక్రమాలు అవసరమన్నారు. ఒక వ్యక్తి తీసుకునే అవయవ దాన నిర్ణయం ద్వారా అనేక కుటుంబాల్లో వెలుగులు నింపవచ్చని పేర్కొన్నారు.

ర్యాలీ అనంతరం నిర్వహించిన ఫ్లాష్‌మాబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు తమ ప్రదర్శన ద్వారా అవయవ దానం ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు.

కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ సిబ్బంది, ఆదిత్య కళాశాల, ఆదర్శ కళాశాలతో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

“అవయవ దానం – మరొకరికి పునర్జన్మ” అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం నగర ప్రజల్లో అవయవ దానంపై చైతన్యం కల్పించింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -spot_img